బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కాజీపేట జంక్షన్, భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లను డివిజన్ కేంద్రాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మధిర రైల్వే స్టేషన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు గతంలో రద్దయిన ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరించాలని, కొత్త రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో గురువారం జరిగిన పార్లమెంట్ మెంబర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే జోనల్ కేంద్రంగా ఉండగా, హైదరాబాద్ ఒక్కటే డివిజన్‌గా ఉన్నందున కాజీపేట, కొత్తగూడెంలను డివిజన్లుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మధిర రైల్వే స్టేషన్‌ను రూ.25 కోట్లతో అభివృద్ధి చేస్తున్నందున కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రయాణికులకు సంబంధించి పలు అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గౌతమి, నాందేడ్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ పునరుద్ధరించాలని, పద్మావతి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒకవైపు మాత్రమే ఆగుతున్నందున వీటిని అప్అండ్డౌన్లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్నో-చెన్నై ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి-షాలీమార్ అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మధిరలో హాల్టింగ్ కల్పించాలని కోరారు. దెందుకూరు వద్ద రైల్వే ట్రాక్ పకన ఉన్న రైతుల భూమికి సంబంధించిన వివాదాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అది ప్రైవేటు పట్టా భూమి అని, రైతులు సాగు చేసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేస్తున్నప్పటికీ, రైల్వే అధికారులు రైతులను ఆ భూముల్లోకి వెళ్లనివ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై తక్షణమే స్పందించి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు.#development #progress #infrastructure #railway #transport
